ప్రముఖ టెలికాం కంపెనీ జియో కీలక ప్రకటన చేసింది. ఇకపై జియో నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా డేటాను తిరిగి అందివ్వనున్నామని ప్రకటించింది. ఐయూసీ ఛార్జీల విషయంలో ట్రాయ్ ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, జియో సొంత నెట్‌వర్క్ కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని ప్రకటించింది. అలాగే, ఇన్‌కమింగ్ కాల్స్‌కు, ల్యాండ్ లైన్స్ విషయంలో ఎలాంటి రుసుమూ వసూలు చేయబోమని తెలిపింది. అక్టోబర్ 10 తర్వాత రీఛార్జి చేసే వారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. ఇప్పటి వరకు జియో యూజర్లు కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలూ చెల్లించడం లేదు. కేవలం డేటాకు మాత్రమే చెల్లించేవారు. ఈ నేపథ్యంలో ట్రాయ్ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఐయూసీ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఐయూసీ ఛార్జీలు పూర్తిగా ఆపేసిన రోజున ఈ ఛార్జీలను వసూలు చేయబోమని ప్రకటించింది. అదే సమయంలో కాల్స్‌కు వసూలు చేసిన మొత్తాన్ని డేటా రూపంలో తిరిగి వినియోగదారులకు అందివ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం కొన్ని టాపప్ వోచర్లను ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని జియో పేర్కొంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) 2017లో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను (ఐయూసీ) నిమిషానికి 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించింది. 2020 జనవరి తర్వాత పూర్తిగా రద్దు చేయాలనుకుంటోంది. గత మూడేళ్లలో జియో ఐయూసీ ఛార్జీల కింద ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి కంపెనీలకు రూ.13,500 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు తమ సొంత నిధుల నుంచే చెల్లించామని తెలిపింది.