GAP Line

Main Banner

Saturday, October 5, 2019

ప్రధానమంత్రి మోదీ గారితో కేసీఆర్ గారి భేటీ



తెలంగాణ రాష్ర్టానికి నిధులతోపాటు పలు సంస్థలను ఇవ్వాలని ముఖ్యమంతి కే చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్రమోదీకి కోరారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన వివిధ అంశాలపై దాదాపు 50 నిమిషాలపాటు చర్చించారు. మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత ఆయనను సీఎం కేసీఆర్ కలువడం ఇదే తొలిసారి. దాదాపు తొమ్మిది నెలల అనంతరం జరిగిన ఈ భేటీ సందర్భంగా 22 అంశాలపై పత్రాలను ప్రధానికి ముఖ్యమంత్రి అందించారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చే నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. హైకోర్టు జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 పెంచాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వివిధ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని, ఇందుకు అవసరమైన నిధులు వెంటనే విడుదలచేయాలని కోరారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)ను రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్టణానికి తరలించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 22 అంశాలపై ప్రత్యేకంగా లేఖలను అందిస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు.

ప్రధానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన లేఖలో 22 అంశాలు ఇవే.. 

1. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఏటా రూ.450 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. గత ఐదేండ్లలో నాలుగుసార్లు విడుదలైనా.. ఒక ఏడాది నిధులు ఇంకా విడుదలకాలేదు. వాటిని వెంటనే విడుదలచేయాలి.
2. నేషనల్‌హైవేస్ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలి.
3. తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలి.
4. తెలంగాణలో ఐఐఎం నెలకొల్పాలి.
5. రాష్ర్టానికి ఐఐఎస్‌ఈఆర్ మంజూరుచేయాలి.
6. హైదరాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను ఏర్పాటుచేయాలి.
7. తెలంగాణలో మరో 23 నవోదయ స్కూళ్లు నెలకొల్పాలి.
8. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులు విడుదలచేయాలి.
9. నీతిఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ కాకతీయ పథకానికి రూ.5,000 కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు విడుదలచేయాలి.
10. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ నెలకొల్పాలి.
11. జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులివ్వాలి.
12. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం మేరకు రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.
13. పీపీపీ పద్ధతిలో కరీంనగర్‌లో ఐఐఐటీ నెలకొల్పాలి.
14. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12%తో కలిపి మొత్తం బీసీలకు 37%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలి.
15. పార్లమెంటులో, అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి. దీనిపై ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ తీర్మానంచేసింది.
16. హైదరాబాద్- నాగపూర్, వరంగల్- హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధిపరచాలి.
17. వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి పీఎంజీఎస్‌వై ద్వారా రూ.4వేల కోట్లు కేటాయించాలి.
18. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా, వందశాతం ఖర్చు కేంద్రమే భరించాలి.
19. సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో పూర్తిగా కేంద్రం ఖర్చుతో వరంగల్‌లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలి.
20. వరంగల్ టెక్స్‌టైల్ పార్కు కోసం వెయ్యికోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా అందించాలి.
21. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించాలి.
22. వరద కాల్వకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదలచేయాలి.