skip to main |
skip to sidebar
నాలుగేళ్ల పిల్లలూ హెల్మెట్ ధరించాల్సిందే..
దిల్లీ: ‘మోటారు వాహనాల సవరణ చట్టం-2019’లోని 28 నిబంధనలను సెప్టెంబరు 1 నుంచి అమలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మిగతా సెక్షన్లకు సంబంధించి ముసాయిదా నిబంధనలను రూపొందించి, అభిప్రాయ సేకరణ తర్వాత వాటిని అమలు చేస్తామంది. తొలుత రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన పాలనాపరమైన నిబంధనలనే ఎక్కువగా అమల్లోకి తెస్తున్నారు. ఇకపై ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలూ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రూ.500 నుంచి రూ.10,000 వరకూ జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించే నిబంధనలు అమలవుతాయి. అధిక లోడుతో వెళ్లే వాహనాలపై రూ.20 వేల జరిమానాతో పాటు ప్రతి అదనపు టన్నుకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తారు. పైగా, అదనపు బరువును దించేంతవరకూ ఆ వాహనాన్ని ముందుకు కదలనివ్వరు. నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకొనే వాహనాలకు ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 చొప్పున జరిమానా విధించడంతోపాటు, అదనపు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించిన తర్వాతే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు. సీటు బెల్టు ధరించని డ్రైవర్లకు రూ.వెయ్యి జరిమానా విధిస్తారు.