skip to main |
skip to sidebar
అక్బరుద్దీన్ ఒవైసీకి కీలక పదవి.. ఇకపై కేబినెట్ హోదాలో..
శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కేబినెట్ హోదా పొందనున్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవి ఎంఐఎం పార్టీని వరించడంతో ఆయన కేబినెట్ హోదా పొందారు. ఎంఐఎం పార్టీకి ఈ పదవి వరించడం ఇదే తొలిసారి. పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఆ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో పీఏసీ చైర‍్మన్ పదవి ఎంఐఎంను వరించింది. ఏడుగురు సభ్యులు ఉన్న మజ్లిస్ పార్టీ తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలోనే కోరింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం పీఏసీ ఛైర్మన్ పదవిని ఎంఐఎమ్‌కు కట్టబెట్టింది. కాగా, ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే మరికొన్ని అసెంబ్లీ కమిటీలను స్పీకర్ ప్రకటించారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డిలను నియమిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ఈ సమావేశంలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, అబ్రహం, శంకర్‌నాయక్, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు. అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు నడవగా.. సమావేశాలు 58 గంటల 6 నిమిషాలు కొనసాగాయి.