skip to main |
skip to sidebar
కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించొదన్న హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న మంత్రిమండలి ప్రతిపాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎర్రమంజిల్‌లోని అసెంబ్లీ భవనం నిర్మించొద్దని ఆదేశించింది. కొత్త అసెంబ్లీ భవనం కోసం ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చకూడదని స్పష్టంచేసింది కోర్టు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నవాదనతో ఏకీభవించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేతపై నిజాం వారసులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోర్టుకెక్కారు. అసెంబ్లీ భవనం కోసం చారిత్రక భవనాన్నికూల్చడం ఎంత వరకు సమంజసమని వాదించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీని కట్టకూడదని ఆదేశించింది. కాగా ఎర్రమంజిల్‌లో మొత్తం 16 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తోంది తెెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ భవనానికి జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయంతో పాటు కొత్త అసెంబ్లీ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయి. ఐతే ఎర్రమంజిల్‌లో పురాతన భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలవడంతో దానిపై విచారించిన కోర్టు, అక్కడి భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.