GAP Line

Main Banner

Friday, October 18, 2019

అభివృద్ధిలో నర్సాపూర్‌



నర్సాపూర్‌ పట్టణం పలు సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. పదిహేను నెలల క్రితం పురపాలికగా ఆవిర్భవించగా నేటికీ ప్రభుత్వం నుంచి పైసా కేటాయింపులు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. పంచాయతీగా కొనసాగిన సమయంలో ఉన్న అధికారులు, సిబ్బంది తప్ప కొత్తగా ఒక్క అధికారిని కూడా నియమించక పోవడం గమనార్హం. ఇతర పురపాలికల అధికారులను ఇక్కడ ఇన్‌ఛార్జులుగా నియమించారు. రాజకీయ జోక్యంతో ఇంతవరకు నలుగురు కమిషనర్లు మారగా ఒక్కరు కూడా ఆరునెలలకు మించి ఇక్కడ కొనసాగ లేదు. జిల్లా స్థాయి ఉన్నతాధికారిని కమిషనర్‌గా నియమించకుండా మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. పాలన ప్రణాళికబద్ధంగా సాగడం లేదు. పనులు చేసినా సకాలంలో బిల్లులు చేతికందక పోవడంతో ఓ గుత్తేదారు ఏకంగా ఆత్మహత్యకు యత్నించాడు. అధికారుల పర్యవేక్షణ లోపంతో 15 వార్డుల్లో పారిశుద్ధ్యం లోపించింది.  పట్టణంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం దర్శనమిస్తోంది. స్వయంగా పాలనాధికారి ధర్మారెడ్డి ఇక్కడి పరిస్థితిని గమనించి వారం రోజుల్లో స్వచ్ఛ నర్సాపూర్‌గా మార్చాలని ఆదేశించారు. జిల్లాలో అత్యంత దయనీయ స్థితికి చేరిన నర్సాపూర్‌ పురపాలికపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.
న్యూస్‌టుడే, నర్సాపూర్‌:
పట్టణీకరణ వేగంగా సాగుతుండడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణాభివృద్ధికి కొత్త పథకాలు, నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో పెరిగిన ప్రజల అవసరాలు, అనుకూలతలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 15 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలను పురపాలికలుగా మార్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో అతిపెద్ద రెండో పట్టణమైన నర్సాపూర్‌ గతేడాది ఆగస్టు 2న పురపాలికగా అవతరించింది. కొత్తగా 15 వార్డులు ఏర్పాటయ్యాయి. పురపాలక సంఘంగా విస్తరించడం, స్థాయి పెరగడంతో ఇక ప్రగతి పట్టాలకు ఎక్కుతుందని అంతా భావించారు. వారి ఆశలను తల్లకిందులు చేస్తూ పట్టణాభివృద్ధి ఆమడ దూరంలో ఉంది.
నలుగురు కమిషనర్ల మార్పు..
నర్సాపూర్‌ పురపాలికలో రాజకీయ జోక్యం అధికమైంది. దీంతో అతి తక్కువ వ్యవధిలో నలుగురు కమిషనర్లు మారారు. ప్రస్తుతం ఉన్న కమిషనర్‌ వెంకటేశ్వర్లు వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుండగా, ఆయన స్థానంలో కౌడిపల్లి ఎంపీడీవో కోటిలింగంకు బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు  సాగుతున్నాయి. ఇదివరకు కమిషనర్‌గా పనిచేసిన వారిలో ఏ ఒక్కరూ ఆరునెలలకు మించి కొనసాగక పోవడం   గమనార్హం. పురపాలిక ఆవిర్భావం నుంచి ప్రత్యేక అధికారిగా మాత్రం జిల్లా సంయుక్త పాలనాధికారి నగేశ్‌ కొనసాగుతున్నారు. మేజర్‌ పంచాయతీగా ఉన్న సమయంలో ఉన్న అధికారులు, సిబ్బంది మినహా ఏ ఒక్కరూ కొత్తవారు రాలేదు. ఇక్కడ ఈవోగా పనిచేసిన శ్రీదేవి   మేనేజర్‌గా మారారు. మేనేజర్‌, జూనియర్‌ సహాయకులు ఇద్దరే రెగ్యులర్‌ ఉద్యోగులు. మిగిలిన వారంతా ఇన్‌ఛార్జులే. ఇద్దరు బిల్‌ కలెక్టర్లు, 45 మంది వరకు పారిశుద్ధ్య, విద్యుత్తు, తాగునీటి  సరఫరా సిబ్బంది ఉన్నారు.
అధికారులు, సిబ్బంది కేటాయింపులో అలక్ష్యం
వాస్తవానికి పురపాలికగా మారిన నర్సాపూర్‌కు ప్రత్యేక అధికారి, కమిషనర్‌, అయిదు విభాగాల్లో ఐదుగురు చొప్పున 25 మంది అధికారులు, సిబ్బందిని నియమించాలి. ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, పరిపాలన కమిషనర్‌, ప్రాజెక్టు అధికారి, విద్యా విభాగాల్లో మొత్తం 40 మంది వరకు నియామకం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి టీపీవో, ఏఈలకు మెదక్‌ నుంచి ఇక్కడకు ఇన్‌ఛార్జి ఇచ్చారు. సంగారెడ్డికి చెందిన సీనియర్‌ సహాయకురాలిని ఇక్కడ ఇన్‌ఛార్జిగా నియమించారు. అకౌంటెంట్‌ కూడా వేరొకచోట నుంచి ఇక్కడకు ఇన్‌ఛార్జిగా నియమించగా ఆమె ఎందువల్లో రావడం లేదు. రెగ్యులర్‌ ఇంజినీరింగ్‌ అధికారులు లేకపోవడంతో అంచనాల రూపకల్పన, పనుల పర్యవేక్షణలో సమస్యలు తలెత్తుతున్నాయి. టెండర్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ విభాగాల్లో సిబ్బంది సంఖ్య రెట్టింపు చేయాల్సి ఉన్నా చేయలేదు. జనన, మరణాల నమోదు మొదలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, నిర్మాణ అనుమతులు, ఉద్యాన వనాలు, రహదారుల నిర్మాణం తదితర అంశాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందకుండా పోతున్నాయి. 15 నెలల్లో నిబంధనలు సాకుగా చూపుతూ కేవలం నాలుగు నిర్మాణాలకు మాత్రమే కొత్తగా అనుమతులు ఇచ్చారు.
పన్ను వసూళ్లతో నెట్టుకొస్తూ...
ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాకపోవడంతో ఇంటి పన్నులు, నల్లాబిల్లుల వసూళ్లు, దుకాణ సముదాయం ద్వారా వచ్చే అద్దెలతో నెట్టుకొస్తున్నారు. బృహత్తర ప్రణాళిక అమలుతో కూడిన క్రమబద్ధ అభివృద్ధికి మార్గం సుగమం కావడం లేదు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్తు పనులు అప్పు చేసి చేస్తున్నారు. సిబ్బందికి వేతనాలు కూడా నెలనెలా సక్రమంగా చెల్లించడం లేదు. పురపాలిక అభివృద్ధికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ రూ.15 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా నేటికీ విడుదల కాలేదు.
అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలు..

పురపాలిక పరిధిలో ఏవార్డులో చూసినా అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. అన్ని వీధుల్లో పందుల సంచారం అధికంగా ఉంది. ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పురపాలికలో ఫాగింగ్‌ యంత్రాలు లేక పోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. బ్లీచింగ్‌ పౌడర్‌ వినియోగం అంతంతమాత్రమే. రోడ్లపై ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, మురుగు ఏరులై పారడం షరా మామూలైంది. తడి, పొడి చెత్తను వేరు చేయడం లేదు. డంప్‌యార్డుకు అయిదు ఎకరాల స్థలం కేటాయించినా వినియోగంలోకి రాలేదు. సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడింది. తాగునీటి సరఫరాలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాలు కురిసిన నేపథ్యంలో భూగర్భజలాలు పెరిగినా ప్రణాళికాబద్ధంగా నీటి పథకాల నిర్వహణ చేపట్టకుండా, నేటికీ వార్డులకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. వాటిని వార్డుల వారీగా క్రమపద్ధ్దతిన పంపకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా వార్డుల్లో అంధకారం రాజ్యమేలుతోంది. వీధి లైట్ల ఏర్పాటులో నిర్లక్ష్యం నెలకొంది. ఇలా అనేక సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నా పట్టించుకునే వారే లేరు. దీంతో అంటువ్యాధులు విజృంభించాయి.

వీలైనంత త్వరలో నిధులు తెప్పిస్తాం...

- మదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నర్సాపూర్‌

నర్సాపూర్‌ పురపాలిక అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరయ్యాయి. వాటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు అందాల్సి ఉంది. వీలైనంత త్వరలో ఉత్తర్వులను సాధిస్తాం. ఆ నిధులు విడుదల అవగానే పట్టణంలో ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తాం.