GAP Line

Main Banner

Wednesday, August 28, 2019

ర్యాగింగ్ చేస్తే చర్యలు..


సంగారెడ్డి: కళాశాలల్లో చదువుతున్న సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం కంది మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిదాలయ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని ర్యాగింగ్ చట్టంలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయడం మానుకోవాలని సూచించారు. నూతన మోటారు వెహికల్ చట్టాల విధి విధానాలు విద్యార్థి దశ నుంచి తెలుసుకుంటే అవగాహన కలుగుతుందని అన్నారు. చదువుపై ఆత్మ విశ్వాసంతో ఇష్టపడి విద్యార్థులు చదువుకుని కన్నవారి ఆశలను నిజం చేసే బాధ్యత తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. 
వ్యవసాయరంగంలో రోజు రోజుకు మారుతున్న ఆధునాతన పరిశోధనలతో రైతులకు అవసరమయ్యే సేవలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్‌కుమార్ మాట్లాడుతూ ర్యాగింగ్ నిరోధానికి కళాశాలలో చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు విద్యార్థిని విద్యార్థుల్లో సోదరభావాన్ని కలిగి ఉండాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రైతులకు సేద్యంలో ఉపయోగపడే అంశాలపై విద్యార్థులు దృష్టి సారించి క్షేత్రస్థాయి పర్యటనలో భాగం పంచుకుని పంటల సాగులో అన్నదాతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని గుర్తు చేశారు. వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అని గ్రామీణ సీఐ శివకుమార్ అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.