GAP Line

Main Banner

Friday, August 30, 2019

ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం..

జడ్చర్ల రూరల్ : ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని.. ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన యువకుడు ఓ బాలికను దారుణంగా హతమార్చిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండా సమీపంలో చోటుచేసుకున్నది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సురేఖ, రవిశంకర్ దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మా యి సిరిహర్షిణి(14) ఏనుగొండ కేంద్రీయ విద్యాలయంలో పదోతరగతి చదువుతున్నది. ఇటీవల ఫేస్‌బుక్‌లో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కోహెడకు చెందిన ఏనుగు నవీన్‌రెడ్డి (28)తో పరిచయం ఏర్పడింది. తాను డిగ్రీ చేశానని మాయమాటలు చెప్పి నిత్యం సిరిహర్షిణితో ఫోన్‌లో మాట్లాడేవాడు. ఈనెల 27న సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన సిరిహర్షిణి సాయంత్రం 5:30 గంటలకు సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో నవీన్‌రెడ్డి అక్కడికి వచ్చి ఆ బాలికను కారులో ఎక్కించుకొని శంకరాయపల్లి సమీపంలో ని గుట్టల వైపు తీసుకెళ్లాడు. అక్కడ కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో నవీన్‌రెడ్డి లైంగిక దాడికి యత్నించగా బాలిక కేకలు వేసింది. ఎవరైనా వస్తే తన వ్యవహారం బయటపడుతుందని బాలిక ను కిందకు తోసేసి ఆమె తలపై బండరాయి వేసి పరారయ్యాడు. ఇంటినుంచి వెళ్లిన తమ కూతురు ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి సమీపంలో రోడ్డుపై సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా యువకుడితో కలిసి కారులో వెళ్లిన విషయాన్ని గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా బుధవారం యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వారిని శంకరాయపల్లి సమీపంలోని గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ సిరిహర్షిణి విగతజీవిగా కనిపించింది. బాలిక మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. సిరిహర్షిణి హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు, కుల సంఘాల వారు ప్రధాన రహదారిపై బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. నిందితుడికి వరంగల్ తరహా శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయవాదులు వాదించకూడదని జడ్చర్ల బార్ అసోసియేషన్ నిర్ణయించిందని ఆ సంఘం అధ్యక్షుడు మాలిక్‌షాకీర్ తెలిపారు.