GAP Line

Main Banner

Thursday, August 29, 2019

వినాయక మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి: సిఐ నాగయ్య


నర్సాపూర్: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలలో ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిఐ నాగయ్య తెలిపారు. గురువారం నాడు నర్సాపూర్ పట్టణంలోని మణికొండ ఫంక్షన్ హాల్ లో వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సిఐ నాగయ్య మాట్లాడుతూ ఎవరైనా ఎక్కడైనా వినాయక మండపాలు ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. వినాయక మండపం నిర్వాహకులు ముందస్తుగా ఆన్లైన్ లో మండపం నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకుని అందుకు సంబంధించిన పత్రాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అందజేయాలని వారు అన్నారు. మండపం నిర్వాహకులు తప్పనిసరిగా విద్యుత్ అధికారుల అనుమతి తీసుకోవాలని.. అదే విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయడం మంచిది కాదని వారు అన్నారు. అదే విధంగా నవరాత్రులలో భాగంగా, నిమజ్జన సమయంలో కాని డీజె సౌండ్ పెట్టడానికి నిబంధనల ప్రకారం ఎటువంటి అనుమతులు లేవన్నారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా మండపాల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. మండప నిర్వాహణ కమిటీలో ముఖ్య సభ్యుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు విధిగా పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని, అదేవిధంగా నవరాత్రుల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. వినాయక చవితి పండుగను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సిఐ నాగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్ రెడ్డి, వివిధ గ్రామాల మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.