skip to main |
skip to sidebar
మెదక్ చర్చి నిర్మాణం అద్భుతం..
మెదక్: వాహ్.. వండర్‌ఫుల్.. ఈ నిర్మాణం ప్రపంచలోనే అద్భుతం. ఆకలితో అలమటించే ప్రజల కడుపునింపి పరలోక ప్రభువు ఆలయ నిర్మాణం కావడం మహా అద్భుతమని ఇంగ్లాండ్ కాంటర్బరి ఆర్చ్ బిషప్ డాక్టర్ జస్టిన్ వెల్‌బి పేర్కొన్నారు. తన యాత్రలో భాగంగా గురువారం ఆయన మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్‌ఐ చర్చ్‌ను సందర్శించారు. స్థానిక బిషప్
మెదక్ పట్టణంలోని ప్రధాన తపాల కార్యాలయం నుంచి సీఎస్‌ఐ చర్చ్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని వివిధ సంస్కృతుల కళాకారులు ఆయనకు తమ ఆహ్వానం పలికారు. ఇందులో గోండు, కోయ, లంబాడ, కోలాటం, చిరుతలు తదితర కళాకారులు నృత్యాలు చేస్తూ ఆయనకు ఆహ్వానం పలికారు. చర్చ్ ప్రాంగణంలోని క్రైస్తవ మతాన్ని సూచించే జెండాలను జస్టిన్ వెల్‌బి దంపతులు ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ–ఆంధ్రా రాష్ట్రాల్లోని చర్చ్‌ల పాస్టర్లు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆచారంలో భాగంగా సిలువతో చర్చ్ చుట్టూ ప్రదక్షణ కొనసాగించారు. అనంతరం చర్చ్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆయన దేవుని సందేశాన్నిస్తూ.. ప్రేమ, సమాధానం, సమానత్వం, ఒకరినొకరు ప్రేమతో గౌరవించడం దేవుని చూపిన మార్గమని, వీటిని ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. దేవుని ముందు మోకరిల్లుతూ ప్రార్థనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మెదక్ అధ్యక్ష మండలం వారు తనను ఆహ్వానించిన తీరు జీవితంలో మరిచిపోలేనిదన్నారు. తెలంగాణ కల్చర్ వివిధ నృత్యాలు, లంబాడ, గోండు, చిరుతలు, కోయ, కోలాటం, తదితర సంస్కృతులను వెలిబుచ్చిన తీరు అద్భుతమన్నారు. ఇక్కడి వేడుకలు ఇంగ్లాండ్‌కు వెళ్లి చెబితే అంతా మంత్రముగ్ధులవుతారన్నారు. ఇలాంటి గొప్ప ఆహ్వానం నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. భారత దేశంలోని కేరళ, కర్ణాటక, శ్రీలంకతోపాటు మెదక్‌చర్చ్‌లను సందర్శించడం సంతోషదాయకమన్నారు.
అంతకు ముందు జుస్టిన్‌వెల్‌బి ఒక చేపకథను వివరించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి రోజంతా కష్టపడిన వలలో చేపలు పడలేవంటా. ఇది గమనించిన పరలోక దేవుడు ఓ మత్స్యకారుడా! నీవున్న చోట నుంచి కుడివైపునకు వల విసరాలని చెప్పడంతో మత్స్యకారుడు అటువైపు వల విసరడంతో అనేక చేపలు చిక్కాయని చెప్పారు. పరలోక ప్రభువు మాట వింటే అంతా మంచే జరుగుతుందని ఆయన వివరించారు. అనంతరం మెదక్ సీఎస్‌ఐ అధ్యక్ష మండలి బిషప్ సాల్మాన్‌రాజ్ మాట్లాడుతూ ఈ చర్చ్ నిర్మించిన చార్లెస్ పాస్నెట్ వాకర్ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చ్ నిర్మించి నేటికి 96 సంవత్సరాలు కావస్తుందన్నారు. ఈ చర్చ్ నిర్మించేందుకు వినియోగించిన ముడిసరుకు గురించి జస్టిన్‌వెల్‌బికి వివరించారు.
!! ఆకట్టుకున్న ప్రదర్శనలు !!
ఇంగ్లాండ్ కాంటర్బరి ఆర్చ్ బిషప్ డాక్టర్ జస్టిన్ వెల్‌బి రాకతో గురువారం మెదక్‌పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. ఆయన రాక తెలుసుకొని తెలంగాణ–ఆంధ్రా రాష్ట్రాల నుంచి చర్చ్‌ల పాస్టర్లు, భక్తులు భారీగా తరలిరావడంతో చర్చ్ ప్రాంగణం కిటకిటలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు ఊరేగింపులో నిర్వహించడంతో ఆందరిని ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండుల నృత్యాలు, చిరుతలు, కోలాటం, లంబాడ నృత్యాలు సంస్కృతికి అద్దం పట్టాయి.
!! భారీ బందోబస్తు !!
మతగురువు జుస్టిన్‌వెల్‌బి మెదక్‌కు రాక సందర్భంగా పట్టణంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో పట్టణంలో అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 4గంటలపాటు పట్టణంలోని చర్చ్ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో మెదక్ అధ్యక్ష మండల బిషప్ ఏసీ సాల్మన్‌రాజ్, కరీంనగర్ బిషప్ రుబిన్‌మార్క్, సౌత్ ఇండియన్ డిప్యూటీ కమిషనర్ థామస్ కే ఉమన్, డిప్యూటి మోడ్రన్ డోర్నాక బిషప్, నంద్యాల బిషప్ పుష్పలలిత, కృష్ణ, గోదావరి బిషప్ జార్జ్ పెర్నాండెజ్, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన 13 జిల్లాల గురువులతోపాటు స్థానిక గురువులు అండ్రూస్ ప్రేమ్ కుమార్, సహాయక గురువులు విజయ్‌కుమార్, దయానంద్, రాజశేఖర్, ఐవాండ్, ఒలెన్‌పాల్, జయరాజ్, శాంతకుమార్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
రెవరెండ్ సాల్మాన్‌రాజ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.