GAP Line

Main Banner

Friday, September 6, 2019

బర్త్‌డే కేక్ తిని.. తండ్రీకుమారుడి మృతి

సిద్దిపేట : అప్పటి వరకు తన పుట్టినరోజని ఆ బాలుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ బర్త్ డే కోసం తెచ్చిన కేక్ తనను మృతువు రూపంలో కబళిస్తుందని ఆ కుటుంబంలో ఎవరూ ఊహించి ఉండరు. పుట్టినరోజు వేడుకలు జరిగిన పది నిమిషాల్లోపే ఆ కుటుంబంలో విషాధ చాయాలు అలుముకున్నాయి. కేక్ తిన్న తండ్రి, కొడుకులు మృతి చెందడం, తల్లి, కుమార్తెలు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకెళ్తే.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో నివాసముంటున్న ఇస్తారిగళ్ల రవి, సిద్దిపేట పట్టణంలోని సంజీవయ్యనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అన్నదమ్ములు. పది సంవత్సరాల క్రితం ఆస్తి తగాదాల నేపథ్యంలో రవి తన అత్తగారి ఇల్లు అయిన ఐనాపూర్ గ్రామంలో కుటంబంతో స్థిరపడ్డాడు. గతంలో సంజీవయ్యనగర్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తి అయిన ఇంటి విషయంలో ఆస్తి తగాదాలు ఉన్నట్లు సమాచారం. దాంతో గత పది సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేకపోవడం గమనార్హం. ఇదే క్రమంలో వారి బంధువు మృతి చెందడంతో అన్నదమ్ములిద్దరూ అక్కడే పలకరించుకున్నారు.
అనంతరం శ్రీనివాస్ రవి ఇంటికి వచ్చి రవి కుమారుడు రామ్‌చరణ్‌ను పలకరించాడు. దాంతో రామ్‌చరణ్ ఈ రోజు తన పుట్టినరోజని బాబాయ్ శ్రీనివాస్‌కి తెలిపాడు. దీంతో సిద్దిపేట నుంచి కేక్‌ను రామ్‌చరణ్‌కు పంపిస్తానని చెప్పిన శ్రీనివాస్ బుధవారం రాత్రి 9.30 గం. లకు సిద్దిపేట నుంచి కేక్‌ను పంపించాడు. 10 గంటల సమయంలో రామ్‌చరణ్(11) తన తల్లిదండ్రులు శ్రీనివాస్, నాగలక్ష్మి, అక్క పూజితలతో కలిసి బర్త్ డే కేక్ కట్ కేసి వేడుకలు జరుపుకున్నాడు. వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే రామ్‌చరణ్‌తో పాటు తండ్రి రవి, తల్లి నాగలక్ష్మి, అక్క పూజితలకు వాంతులు, విరేచనాలు మొదలవడంతో స్థానికులు ఆటోలో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరీక్షించిన వైద్యులు పూజిత ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. తండ్రి రవి, రామ్‌చరణ్‌లకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో గురువారం వేకువజామున వారిరువురు మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తల్లి నాగలక్ష్మిని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. ఈ మేరకు బంధువులు శ్రీనివాస్ వారి మృతికి కారణమని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రామ్‌చరణ్ బాబాయ్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడిషనల్ డీసీపీ లాండ్ ఆర్డర్ గోవిందు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీలు రామేశ్వర్, మహేందర్, సీఐలు ఆంజనేయులు, సైదులు, రఘులు పర్యవేక్షించారు
.