skip to main |
skip to sidebar
హరీశ్ రావు గారికి ఆత్మీయ సన్మానం చేసిన జగ్గారెడ్డి గారు
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఒకప్పుడు టీఆర్ఎస్ అంటేనే అంతెత్తున ఎగిరిపడ్డ జగ్గారెడ్డి... రెండోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తన స్వరాన్ని సవరించుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించబోనని తెలిపిన జగ్గారెడ్డి... హరీశ్ రావును మాత్రం ఏ రేంజ్‌లో టార్గెట్ చేశారు. ఆయన కారణంగానే నిజాంసాగర్ ఎండిపోయిందని... సంగారెడ్డి నీటి ఎద్దడికి హరీశ్ రావే కారణమంటూ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. అలాంటి జగ్గారెడ్డి తాజాగా హరీశ్ రావుతో కలిసి అభివృద్ధి పాట పాడటం... మంత్రి హోదాలో సంగారెడ్డికి వచ్చిన ఆయనతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు హరీశ్ రావుకు ఆత్మీయ సన్మానం చేసిన జగ్గారెడ్డి... అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారా ? అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో మొదలైంది.కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్న టీఆర్ఎస్... జగ్గారెడ్డిని చేర్చుకోవడానికి మాత్రం ముందుకు రాలేదు. ఇందుకు అసలు కారణం ఆయన హరీశ్ రావును విమర్శించడమే అనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన హరీశ్ రావుతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో... జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. మరి...హరీశ్ రావుతో ఆత్మీయ సన్మానం చేసిన జగ్గారెడ్డి... ఇప్పటికైనా కారెక్కుతారా లేదా అన్నది చూడాలి.