skip to main |
skip to sidebar
మున్సిపల్ అభివృద్ధికి నిధుల మంజూరు
పార్టీలకతీతంగా నర్సాపూర్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అందరి అభిప్రాయం మేరకే మంజూరైన నిధులను ఖర్చు చేస్తామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణారెడ్డి, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీయాదవ్ పట్టణంలోని బస్టాండ్, శ్రీరాంనగర్‌కాలనీ, వినాయకనగర్‌కాలనీ, జగన్నాథరావుకాలనీ, సునీతాలకా్ష్మరెడ్డికాలనీ, ఎన్‌జీవోస్ కాలనీలో పర్యటించి కాలనీ వాసులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కాలనీలో అవసరం ఉన్న మురికికాల్వలు, సీసీరోడ్ల ఇతర సమస్యలపై అధ్యయనం చేశారు. జేసీ నగేశ్, ఆర్డీవో అరుణారెడ్డి, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ వెంకటేశ్వర్లుకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీయాదవ్‌లు మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసిందని, మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో పనులు పూర్తయితే నర్సాపూర్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. సీసీరోడ్లు, మురికి కాల్వలు, ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు వంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు బాబ్యానాయక్, శేషసాయిరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరమణారావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు అశోక్‌గౌడ్, వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, హబీబ్‌ఖాన్, మల్లేశ్‌యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, నాయకులు సూరారం నర్సింహులు, సత్యంగౌడ్, నగేశ్, మహ్మద్, కృపాచారి, నహీం ఉన్నారు.