ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా..పడిగాపులు కాసినా..దప్ధర్లల్ల పనులు కాక సతమతమవుతున్నరా..? భూమి పత్రాల కోసం పోతే చచ్చిపోయినోళ్ల సాక్ష్యం కావాలని లేనిపోని కిరికిరి పెడుతున్నారా..? ఎంతోకొంత సర్దుబాటు చేస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారా..? పింఛను కోసం పితలాటకం పెడుతున్నారా..? రాషను కావాలంటే రాసకారం చేస్తున్నారా..? అవినీతి సైంధవుడు మీ పనులకు అడ్డుపడుతుండా..? చేయి తడపందే కాగితం కదలనంటున్నదా..? సర్కారు అందించే సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదా..? అయితే రండి మోగించండి ధర్మఘంట. సమస్య ఏదైనా పరిష్కారం కావాలంటే ధర్మగంట గణగణలాడించండి. మీరు పంపే ఫిర్యాదుతో ఈ గంట మోగుతుంది. ప్రజలకు అండదండలు అందించే ఉత్తములైన ఉద్యోగులు, సామాన్యులకు దారిచూపే అంకితభావంతో పనిచేసే అధికారులతో పేచీ లేదు. అమ్యామ్యాలు ఆశించే టేబుల్ కింది చేతులతోనే సమస్య. అన్నీ సవ్యంగా ఉన్నా ఇంకేదో కావాలని మడతపేచీ పెట్టే తిరకాసు రాయుళ్లతోనే ఇబ్బంది. ప్రజాసేవ మరచిపోయి అవినీతిని పులుముకున్న ప్రజాప్రతినిధులతోనే చిక్కు. ఈ అన్ని జాడ్యాలను తరిమికొట్టేందుకే ధర్మఘంట. సర్కారుకూ ప్రజలకూ మధ్య వారధి నిర్మించే చిరుప్రయత్నం ఈ ధర్మగంట.