GAP Line

Main Banner

Wednesday, September 25, 2019

విద్యుత్‌షాక్‌తో భార్యాభర్తలు మృతి



హత్నూర : విద్యుత్‌షాక్‌తో భార్యాభర్తలతోపాటు రెండు కాడెడ్లు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాధుర గ్రామశివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అదేమండలం కొన్యాల గ్రామానికిచెందిన పత్తి మల్లేశం (38) పత్తి నర్సమ్మ (35) దంపతులు ఇద్దరు వారికాడెడ్లను తీసుకొని మాధుర గ్రామశివారులోని పంటచేనుకువెళ్లారు. రోజంతా అక్కడ ఎడ్లనుమేపి సాయంత్రం ఇంటివచ్చేక్రమంలో సమీపంలోని మక్కజొన్న చేను వద్దకు రాగానే పంటరక్షణకోసం ఏర్పాటుచేసిన ఇనుపతీగకు విద్యుత్‌సరఫరా అయింది. ప్రమాదవశాత్తు కాడెడ్లకు ఇనుపతీగ తగలడంతో అవి మృతిచెందగా వాటిని కాపాడే ప్రయత్నంలో మల్లేశం, నర్సమ్మ దంపతులు మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న తాసిల్దార్ జయరాం, జిన్నారం సీఐ లాలునాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని శవాలకు పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబీకులకు సహాయం అందజేస్తామని తహసీల్దార్ ప్రకటించారు.