GAP Line

Main Banner

Tuesday, September 17, 2019

పాక్‌ క్రికెటర్లకు ఇక బిర్యానీ బంద్‌



ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఇక మీదట బిర్యానీ, స్పైసీ ఫుడ్‌, స్వీట్లు తినడానికి వీల్లేదని ఆ జట్టు నూతన కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌ మిస్బా ఉల్‌ హక్‌ ఆదేశాలు జారీ చేశాడు. ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికే ఈ డైట్‌ విధానం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నాడు. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే వారికి ఉద్వాసన పలుకుతామని హెచ్చరించాడు. నూతన డైట్‌ విధానం ప్రస్తుత పాకిస్థాన్‌ జట్టు సభ్యులతో సహా, జాతీయ స్థాయి క్రికెటర్లందరికీ వర్తిస్తుందని ఆటగాళ్ల క్యాటరింగ్‌ బాధ్యతలు చూసుకునే ఒక వ్యక్తి పేర్కొన్నాడు. ఆటగాళ్ల డైట్‌, ఫిట్‌నెస్‌పై లాగ్‌బుక్‌ నోట్‌ చేస్తామని మిస్బా ప్రకటించాడు. ప్రపంచకప్‌లో విఫలమైన పాక్‌ జట్టుపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మెగా ఈవెంట్‌ అనంతరం గత కోచ్‌ మిక్కీ ఆర్థర్‌కి ఉద్వాసన పలికిన పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇటీవలే మిస్బాను ప్రధాన కోచ్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో వారిని ఫిట్‌గా తయారు చేసేందుకు మిస్బా ఆహారం విషయంలో తొలి అడుగు బలంగా వేశాడు. ఆటలేని సమయంలో ఇష్టానుసారంగా మాంసాహారం, జంక్‌ ఫుడ్‌ తినే ఆటగాళ్లకు ఇది కష్టతరం కావొచ్చు. నూతన కోచ్‌గా ఎంపికైన సమయంలో మిస్బా మాట్లాడుతూ జట్టును విజయపథంలో నడిపించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పాడు. ‘మన వద్ద ఉండే అవకాశాలతోనే మన ఎత్తుగడలు ఉంటాయనే విషయాన్ని నమ్ముతాను. తద్వారా ప్రత్యర్థులను బలహీనపర్చి వారిని ఓడించే ప్రయత్నం చేయాలి. ఒక కోచ్‌గా అత్యుత్తమ జట్టుని తీర్చిదిద్దడానికి ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి కృషి చేస్తా. అలానే పాక్‌ జట్టు తేలికగా మ్యాచ్‌లు గెలిచేలా ప్రయత్నిస్తా. ఒక్కోసారి ప్రత్యర్థులు బలంగా ఉండొచ్చు. అప్పుడు వారి బలాబలాలపై కన్నేసి మన వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది’ అని మిస్బా పేర్కొన్నాడు.