skip to main |
skip to sidebar
హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థిగా శ్రీకాంతాచారి తల్లి ?

తెలంగాణ రాజకీయంలో హుజూర్ నగర్ ఉపఎన్నిక మరోసారి అగ్గిరాజేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీ స్థానం నుంచి గెలిచి, అసెంబ్లీ సీటు వదిలేసుకున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉపఎన్నికలో పోటీదారులుగా ప్రధాన పార్టీల నుంచి పలువురు అభ్యర్థులు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. 2018లో టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ బరిలో నిలిచారు. అయితే స్వల్ప ఓట్ల తేడాతో సైదిరెడ్డి ఓటమి పాలయ్యారు. కాగా ఉపఎన్నికల రూపంలో ఏడాది తిరక్కుండానే సైదిరెడ్డికి మరోసారి అదృష్టం పరీక్షించుకునే ఛాన్స్ రావడం విశేషం. ఇదిలాఉంటే హుజూర్‌నగర్ నుంచి 2014లో టీఆర్ఎస్ తరపున తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీలో నిలవడం గమనార్హం. అయితే ఉపఎన్నికల్లో తనకు చాన్స్ ఇస్తారని ఇప్పటికే శంకరమ్మ గంపెడు ఆశపెట్టుకుంది. కానీ మరోసారి కూడా గత ఎన్నికల్లో ఓటమి పాలైన సైదిరెడ్డికే చాన్స్ ఇవ్వడంతో ఆమె మనస్థాపానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శంకరమ్మ ఎలాగైనా బరిలో నిలవాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఇప్పటికే టిక్కెట్‌ను ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డికే ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ దక్కే చాన్స్ లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో దిగిందని సమాచారం. ఇందులో భాగంగా శంకరమ్మను బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దింపితే అటు తెలంగాణ వాదులు బీజేపీ పక్షాన నిలిచే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే అధికార టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టినట్లు అవుతుందని బీజేపీ వ్యూహకర్తల అంచనాగా ఉంది. కాగా శంకరమ్మ తనకు టిక్కెట్ కావాలని అడగలేదని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పడం కూడా టీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టే అంశంగా మారనుందని బీజేపీ అంచనా వేస్తోంది.