GAP Line

Main Banner

Sunday, October 20, 2019

మూడు రోజుల్లో నర్సాపూర్‌కు కొత్త కమిషనర్‌న్యూస్‌టుడే, నర్సాపూర్‌: పట్టణ ప్రజలకు సేవలు అందించడంలో నర్సాపూర్‌ పురపాలిక నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోంది. దీంతో ప్రజలు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. పనితీరు అధ్వానంగా మారిన వైనంపై ‘అభివృద్ధిలో నర్సాపూర్‌’ శీర్షికన ఈనెల 18న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి జిల్లా సంయుక్త పాలనాధికారి నగేశ్‌ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం పురపాలిక కార్యాలయాన్ని సందర్శించి పలు అంశాలపై ఆరా తీశారు. పలు దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులర్‌ కమిషనర్‌ లేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. మూడు రోజుల్లో ఇక్కడి పురపాలికకు కొత్త కమిషనర్‌ నియామకం జరుగుతుందని  తెలిపారు. వార్డుల్లో తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం నిర్వహణ తీరు, పందుల సంచారం... తదితర అంశాలపై పురపాలిక మేనేజర్‌ శ్రీదేవిని అడిగి తెలుసుకున్నారు. పందుల యజమానులకు మూడు సార్లు  తాఖీదులు ఇచ్చామని.. వారి తీరులో మార్పు రాలేదని మేనేజర్‌ వివరించారు. అవసరమైతే కేసులు నమోదు చేయించాలని సంయుక్త పాలనాధికారి ఈ సందర్భంగా ఆదేశించారు. అన్ని వార్డుల్లో వీధిదీపాలు వెలిగేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు వేల ఎకరాలు... నర్సాపూర్‌ మండలంలో అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన వివాదాస్పద భూములు మూడు వేల ఎకరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గతంలో 6,500 ఎకరాలు దాకా ఉండేవన్నారు. ఈనేపథ్యంలో అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా భూముల సర్వే చేస్తున్నారని చెప్పారు. వాటికి హద్దులు నిర్ణయిస్తారని వివరించారు. భూదస్త్రాల ప్రక్షాళన చేపట్టాక కొన్ని సర్వేనెంబర్లలోని విస్తీర్ణం విషయంలో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.