GAP Line

Main Banner

Saturday, March 14, 2020

కంచె వేస్తేనే రక్ష.. లేకుంటే కబ్జా.!నర్సాపూర్‌లో రూ.25 కోట్ల విలువైన స్థలాలు రెవెన్యూ శాఖ గుర్తింపు పురపాలికకు అప్పగింతకు నిర్ణయం కాపాడుకోవాల్సిన అవశ్యం 

న్యూస్‌టుడే, నర్సాపూర్‌ పట్టణంలో ప్రభుత్వ స్థలాలు లభించక అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. ఈ కారణంతో ప్రగతి నిధులు  తరలిపోతుంటే అధికారులు ఉన్న స్థలాలను కాపాడే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయడం, లేదంటే ఆలయ భూములను ప్రతిపాదించడం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు లభించే పరిస్థితి లేకపోవడంతో ఇటీవల రెవెన్యూ అధికారులు పట్టణంలో సర్వే చేసి విలువైన సర్కారు స్థలాలను గుర్తించి పురపాలికకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా వాటిని పురపాలికకు స్వాధీనం చేసే వరకు అలాగే వదిలేస్తే అన్యాక్రాంతమయ్యే ప్రమాదం పొంచి ఉంది.పట్టణంలో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలు ఉన్నా... ఇదివరకు ఇక్కడ పనిచేసిన అధికారులు వాటిని ఉపయోగించకుండా స్థలం లేదని పేర్కొనడంతో నర్సాపూర్‌నకు మంజూరైన ఆదర్శ పాఠశాల, గోమారంలోని పాలిటెక్నిక్‌, పెద్దచింతకుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు... పక్క గ్రామాలు, మండలాలకు తరలిపోయాయి. అయినా ఎప్పుడో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సర్వే నెంబరు 79లోని స్థలాల జోలికి మాత్రం అధికారులు వెళ్లడం లేదు. సుమారు 10 ఎకరాల భూముల్లో మాత్రం ‘ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమించినచో శిక్షార్హులు’ అంటూ బోర్డులు దర్శనం ఇస్తాయి. ఇలా సుమారు రూ.10 కోట్ల విలువైన భూములు కొన్నేళ్లుగా అలా పడి ఉన్నాయి. సంబంధిత అధికారులు మాత్రం ఎందువల్లో వాటి వైపు చూడటం లేదు. ప్రగతి పనులకు ప్రతిపాదించడానికి చొరవ చూపడం లేదు. ఈ స్థలాల్లోకి తరచూ ఆక్రమణదారులు చొరబడుతున్నారు. వేసిన కంచెను ధ్వంసం చేయడం, సాగు చేయడం వంటివి చేస్తున్నారు. నూతన పురపాలిక చట్టం ఆమోదం పొందిన ఏడాదిలోగా బల్దియా పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రహరీ, ఇనుప కంచెలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పట్టణంలో గుర్తించిన ప్రభుత్వ స్థలాల చుట్టూ కంచెలు, ప్రహరీ నిర్మించాలంటే రూ.లక్షలు అవసరం అవుతాయి. ఇప్పటికే నిధులు లేక నీరసించి పోతున్న బల్దియాకు ఇదొక సమస్యగా మారింది. 

‘ప్రగతి’కి అనుకూలమైన స్థలాలు.. 

పట్టణంలో రెవెన్యూ అధికారులు గుర్తించిన విలువైన స్థలాలు ప్రగతి పనులకు ఎంతో అనుకూలం. ముఖ్యంగా సర్వే నెంబరు 79లో గుర్తించిన 16-35 ఎకరాల్లో సుమారు పది ఎకరాలకు మాత్రమే రక్షణ కంచె వేశారు. రూ.కోట్ల విలువైన ఈ స్థలాలు ఇళ్ల మధ్యన ఉండగా ఆక్రమణలకు అవకాశాలున్నాయి. వినాయక్‌ నగర్‌ కాలనీలో ప్రస్తుతం గుర్తించిన స్థలాలను  పట్టణ ప్రగతి కార్యక్రమం కింద చదును చేశారు. పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను తొలగించారు. జేసీబీలతో శుభ్రం చేశారు. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్రమార్కులు పాగా వేయడానికి పావులు కదుపుతున్నారు. ప్రస్తుతానికి 79 సర్వేనెంబరులో 1-10 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నాయని అధికారులు సర్వేలో తేల్చారు. పక్కా నిర్మాణాలకు బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. మరికొన్ని పూర్తయి వినియోగంలో ఉన్నాయి. షాదీఖానా సమీపంలో సర్వే నెంబరు 3లో 30 గుంటల స్థలాన్ని గుర్తించారు. ఇక్కడ గజం స్థలం రూ.10-20 వేల వరకూ పలుకుతోంది. ఇంతటి విలువైన స్థలాన్ని చదును చేసి వృథాగా వదిలేశారు. శివాలయం వీధిలో 76 సర్వే నెంబరులో 2-20 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించగా కంచె ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఆక్రమించుకున్నారు. గతంలో గొర్రెలు, మేకల విక్రయ మార్కెట్‌ ఏర్పాటుకు ప్రతిపాదించగా అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. స్థలాన్ని గుర్తించిన వెంటనే బోర్డు, కంచె ఏర్పాటు చేసి ఉంటే అన్యాక్రాంతం అయ్యేది కాదని అంటున్నారు. ఇలా ఎంతో విలువైన ప్రభుత్వ స్థలాల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అన్యాక్రాంతం అవుతున్నాయని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పురపాలికకు మ్యాపులు అందజేశాం- మాలతి, తహసీల్దార్‌, నర్సాపూర్‌ 

పట్టణ పరిధిలో గుర్తించిన ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన మ్యాపులు పురపాలికకు అందజేశాం. పురపాలికకు అప్పగించాలంటూ పాలనాధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అనుమతులు రాగానే స్థలాలను అప్పగిస్తాం. విలువైన స్థలాలు కావడంతో వీలైనంత త్వరగా రక్షణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది.